అభ్యర్థి ఏ పార్టి వాడని కాదు..ఏపాటి వాడో చూడు...ఎన్నుకుంటే వెలగ బెట్టడంకాదు...ఇప్పటిదాకా ఏంచేసిండో చూడు...పెట్టుకునే టోపి కాదు.పెట్టిన టోపి చూడు...ప్రజాకవి కాళోజి

డ‌ప్పు.. ప్ర‌కాశం

ఎక్కడ ఏ పల్లె గుండెకు గాయమైనా, ఎక్కడ ఏ ఉద్యమ గాలి వీచినా, అక్కడకు తనతో పాటే డప్పుని వెంటేసుకుని జనం ఘోషలపై తన పాటకి తన డప్పుతోనే లయబద్ధంగా శృతి కలిపేవాడు. అందుకే అసలు పేరు నలుగోల శ్రీనివాసరావైనా జనం అంతా 'డప్పు ప్రకాష్‌' అనే పిలుస్తారు. అందుకే అతని డప్పు బహుజనుల గుండె చప్పుడైంది. తమ కష్టాల్నీ, కన్నీళ్లనీ, ఆవేదన్నీ, అంతరాంతాల్లోని స్పందనల్నీ అతని స్వరం నుంచి డప్పు శబ్దంలోకి ఒలికిపోతున్న సమయం అందర్నీ కన్నీరుపెట్టిస్తుంది. అంతా ప్రజాస్పందన కలిగించే జన గాయకుడు దిక్కులేని అత్యంత దయనీయస్థితిలో రోడ్డుపక్క తుదిశ్వాస విడిచాడు. ఈ సందర్భంగా ఆ డప్పు ప్రకాష్‌ గుండెచప్పుడు 'జీవన' పాఠకుల కోసం..
'పల్లె పల్లెన దళిత కోయిల' అంటూ కలేకూరి ప్రసాద్‌ గీత రచనలకు తన గొంతుకతో జీవం నింపుతూ ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసినవాడు డప్పు ప్రకాష్‌. పల్లె ప్రజ నుంచి విశ్వ విద్యాలయాల పరిశోధకుల వరకూ అందరికీ అతను సుపరిచితుడు. డబ్బు కోసం పాట అమ్ముడుపోతున్న వేళ తన డప్పుతో జనం పాటకి గొంతుకిచ్చాడు అతడు. అందుకే అందరూ అతన్ని 'డప్పు ప్రకాష్‌' అని పిలుచుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో దేశంలో తెలుగోళ్లున్న చోటల్లా అందరి గుండెల్లో మార్మోగేలా తన డప్పునూ పాటనూ విన్పించాడు.
జనమే జీవితమై..
డప్పు ప్రకాష్‌ తన గురించీ, తన జీవితంలోని సంగతుల్నీ తన సన్నిహితులతోనూ ఏనాడూ పంచుకోలేదు. తన జీవితం ఎలా మొదలైనా.. యవ్వనంలో ఏదారుల్లో నడిచినా.. చదువులేక పోయినా.. అనుకోని పరిస్థితుల్లోనే ప్రజా ఉద్యమాలవైపు అడుగులు వేశాడు. డప్పు ప్రకాష్‌కు తల్లిదండ్రులు పెట్టినపేరు నలుగోల శ్రీనివాసరావు. తండ్రి పేరు సాంబయ్య, తల్లి పేరు రాములమ్మ. దళిత కుటుంబంలో ఆరుగురు సంతానంలో డప్పు ప్రకాష్‌ రెండోవాడు. ఆతనికి అక్క, తమ్ముడు, ముగ్గురు చెల్లెళ్లు ఉన్నారు. ఉద్యోగరీత్యా సాంబయ్య కుటుంబం కరీంనగర్‌ జిల్లా గోదావరిఖనికి తరలొచ్చింది. అక్కడే చదువుకి పుల్‌స్టాప్‌ పెట్టి... చిన్న చిన్న వీధి తగదాల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ కాలం గడిపేవాడు. ఆ సమయంలో నక్సలైట్ల ఉద్యమంలో జనం పాటకు అతను ఆకర్షితుడయ్యాడు. స్నేహితుల ప్రభావంతో పీపుల్స్‌వార్‌ పార్టీలో చేరాడు. దళ సభ్యుడి నుంచి ఆర్గనైజర్‌గా మారాడు. ఆ క్రమంలోనే 1980లో ఒకామెను ప్రేమించి, పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికీ ఒక కుమారుడు ఉన్నాడు. విప్లవ కార్యక్రమాలకు ఆటంకం లేకుండా కొడుకుని గోదావరిఖనిలోని అత్తగారింటే విడిచి పెట్టేశారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల భార్యతో విడిపోయాడు. ఆమె అసలు పేరు, వివరాలు అతను ఎవరికీ ఎప్పుడూ చెప్పుకోలేదు. 
పీపుల్స్‌వార్‌లో ఉన్న సమయంలో 'కిరణ్‌' అనే పేరుతోనూ, జననాట్యమండలిలో ఉన్నప్పుడు 'మల్లన్న'గా ఉన్నా, దళిత బహుజన కళాకారునిగా 'డప్పు ప్రకాష్‌' పేరుతోనూ చనిపోయే వరకూ చలామణీ అయ్యాడు. అతను ఎక్కడ ఉంటే అదే తన ఊరని చెప్పేవాడు. గత కొన్నేళ్లుగా తెనాలి సమీపంలోని అమృతలూరులో ఎమ్మార్పీయస్‌ నాయకుడు కోటయ్య ఇంటిలో ఉంటున్నాడు. ఎంత దయనీయ పరిస్థితి అంటే అతను జీవనం గడవడం కనాకష్టంగా మారడం. ఆ క్రమంలో తెనాలిలో ఒక దుకాణం మెట్ల మీద ఏ దిక్కూ లేనట్లు తనువు చాలించడం. అతని అంత్యక్రియలకూ కుటుంబసభ్యులెవరూ హాజరుకాకపోవడం మరో విషాదం.
జనం గొంతుకగా..
గోదావరిఖనిలో పీపుల్స్‌వార్‌ ఆర్గనైజర్‌గా ఉన్న క్రమంలో జననాట్యమండలి సాంస్కృతిక దళంలో చేరాలని అనుకున్నాడు. కానీ అతనికి అప్పటికి వచ్చిన పాటలు రెండే రెండు. అవి...''ఎర్రజెండెర్రజెండ ఎన్నియలో...'' ''ఓలీ ఓలీల...'' అనేవి మాత్రమే. ఆ తర్వాత అక్కడి నుంచి ఉద్యమ నిమిత్తమై కృష్ణాజిల్లా విజయవాడ వచ్చాడు. అయితే దళసభ్యులతో కలవలేకపోవడంతో కొన్నాళ్లు బెంజిసర్కిల్‌ వద్ద ఒక హోటల్‌లో సర్వర్‌గా పనిచేశాడు. సున్నంబట్టీల సెంటర్లో నివాసం ఉండేవాడు. ఆ సమయంలోనే ప్రెస్‌క్లబ్‌లో ఒక సమావేశానికి వెళ్లి, అక్కడ దళ సభ్యులతో పరిచయం ఏర్పర్చుకుని, హోటల్‌ సర్వర్‌ పని మానుకున్నాడు. ''1985లో ఉయ్యూరులో జరిగిన సూరపనేని జనార్థన్‌ వర్థంతిసభకు జననాట్యమండలి కళాకారుడు గద్దర్‌ వచ్చాడు. ఆయనతో కలిసి కొంతమంది కళాకారులు గొంతుకలిపి పాటలు పాడారు. ఆ సందర్భంలో నా గొంతు వారి స్వరాలకు భిన్నంగా ఉండడంతో.. గద్దర్‌ నన్ను బలవంతంగా స్టేజ్‌ దింపేశాడు. ఈ ఘటన నా మనసులో కసిని రగిలించింది. ఎలాగైనా ప్రజాకళాకారునిగా ఎదగాలని పట్టుదలతో శ్రమించాను'' అని ఒక ఇంటర్వ్యూలో డప్పు ప్రకాష్‌ తను పాటకు ఎలా పెనవేసుకున్నదీ చెప్పుకొచ్చాడు. ఒకసారి కృష్ణాజిల్లా పెంజెండ్రలో జననాట్యమండలి కళాకారుల కోసం శిక్షణా తరగతులు నిర్వహించింది. రాష్ట్రం నలుమూలల నుంచీ వందలాది మంది కళాకారులు ఈ తరగతుల్లో పాల్గొన్నారు. ''ఆ తరగతుల్లో నేను కుమారి అనే కళాకారిని దగ్గర పాటలు పాడడం నేర్చుకున్నా. అలాగే దివాకర్‌ అనే కళాకారుని వద్ద ఒగ్గు కథలో కూడా శిక్షణ పొందా. డప్పు కొట్టడాన్ని మాత్రం ఎవరిదగ్గరా నేర్చుకోలేదు.. కానీ డప్పు రమేష్‌ని చూసి.. ఆయన్ని అనుకరిస్తూ నేర్చుకున్నా'' అని ఆ ఇంటర్వ్యూలోనే డప్పు ప్రకాష్‌ చెప్పాడు. అదే ఏడాది కృష్ణాజిల్లా జననాట్య మండలి అధ్యక్షునిగా ప్రకాష్‌ ఎంపికయ్యాడంటే అతడు ఎంత నిష్ణాతుడయ్యాడో చెప్పక్కర్లేదు. ఆ తర్వాత విస్తృతంగా కళాప్రదర్శనల్లో పాల్గొని జనం గొంతుకయ్యాడు.
బహుజన కళాకారునిగా
పీపుల్స్‌వార్‌లో ప్రాంతీయకమిటీలో భాగస్వామి కావడంలో తన మకాంను గుంటూరు జిల్లా జూలకల్లుకు మార్చాడు. 1990 తర్వాత ఆ పార్టీతో సంబంధాలు వదులుకుని, దళిత ఉద్యమాల్లోకి వెళ్లాడు. 1991 ఆగస్టు 6న జరిగిన చుండూరు ఘటన తర్వాత మరింతగా ఆ ఉద్యమంతో మమేకమయ్యాడు. అప్పటికే ర్యాడికల్‌ విద్యార్థి సంఘంలో పనిచేసిన ప్రముఖకవి కలేకూరి ప్రసాద్‌ దళిత ఉద్యమాన్ని తన రచనలతో ఊపునిస్తున్న సందర్భం. ఆయన రచనకు ప్రకాష్‌ గొంతుకతో పాటు డప్పు వాయించాడు. వీరి ద్వయం బహుజనాలకు గుండెచప్పుడు అయ్యింది. కలేకూరి రాసిన ''పల్లె పల్లెనా దళిత కోయిలా.. బతుకుపాట పాడుచుండగా...సాగే పేదోళ్ల జాతర'' అనే పాట డప్పు ప్రకాష్‌కు మంచిపేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చాయి. కారంచేడు, మానుకొండ దురంతాలపై ''చుక్కల్లో కలిసిరేమో సక్కనయ్యలూ....చుక్కలైపోయారూ సక్కనయ్యలూ'' అనే కలేకూరి పాట ఎక్కడ ఏ దళితసభ జరిగినా అందులో డప్పు దరువుతో ప్రకాష్‌ పాడేవాడు. అంతకుముందు ఆదివాసీలపై కలేకూరి రాసిన ''గోండు గుండెలో రగిలిన జ్వాలలు.. విప్లవమా నీకు లాల్‌సలామ్‌'' అనే పాటనీ డప్పు ప్రకాషే ఆలపించాడు. చుండూరు అమానుషత్వంపై ''కుమిలిపోయినా...నలిగిపోయినా...చుండూరు గుండెలో గాయం'' అనే గీతాన్ని కరుణ రసాత్మకంగా వినిపించడానికి డప్పు ప్రకాష్‌ గళమే కారణం. మంగళగిరిలో మహిళల ఉద్యమానికి 1993లో బాసటగా నిలిచి ''కీచకుల సీమలో చెల్లెలా... అలజడివై రగలాలి కదలిరా...!'' అని పాడి మహిళాలోకానికి చైతన్యం నింపాడు. ప్రకాశం జిల్లాలో మేఘన అనే అమ్మాయి నోట్లో యాసిడ్‌ పోసి చంపేసిన ఘటనపై ''కలల కడలిలా కదిలిపోయిన ఓ మేఘనా..! రగులుతోంది నీ మృత్యువు అగ్ని జ్వాలలా'' అనే పాట ఆ సంఘటనపై ప్రతి ఒక్కరూ రగిలేలా అతని గొంతుక జ్వలించింది. కోదాడలో 1994లో జరిగిన దళిత సాహిత్య వేదికలో మద్దూరి నగేష్‌బాబు రాసిన ''ఎద్దు కూర తిన్నాడే ఎంత ముద్దుగున్నాడో.. ముద్దపప్పు శాఖాహారి బుద్ధిహీనుడైనాడే'' అనే పాటని డప్పు ప్రకాష్‌ పాడాడు. ఈ పాటని ఆ ఒక్క వేదిక మీదే కాకుండా బీఫ్‌పై నిషేధం వేస్తున్న సందర్భాల్లో విశ్వవిద్యాలయాల వేదికలపై ఎన్నోసార్లు డప్పు వాయిస్తూ గళం ఎత్తాడు. వేముల రోహిత్‌ సంఘటనలో ఎన్నో సభల్లో పాల్గొన్నాడు.. పాలకుల కులవివక్ష తీరుపై ''గద్దెనెక్కి కులుకుతున్న పెద్దకులం మంత్రులారా.. నా కడుపు శోకాన్ని డబ్బుతో కొనగలరా'' అనే పాటతో నిగ్గదీసి అడిగాడు. 
ఎర్రబాట నుంచి నీలిపాటగా లాల్‌నీల్‌ కలయికగా.. బహుజన గొంతుకలతో డప్పు ప్రకాష్‌ పెనవేసుకుపోయాడు. బహుజన ఉద్యమాలను పాటతో పదునెక్కించిన డప్పుప్రకాష్‌ గత ఏడాదిగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ.. ఓ పక్క కడు పేదరికం.. మద్యానికి బానిసగా మారడం.. అతని జీవితం విషాదాంతమైంది. బహుజనుల గొంతుక మూగపోయింది.. పీడితులపై ప్రకాష్‌ చైతన్య డప్పు ఆగిపోయింది.

నీలిజెండా పాటల విలుకాడు
డప్పు ప్రకాష్‌ నీలి జెండా పాటల విలుకాడుగా ప్రజాకళారంగంలో తనదైన ముద్ర వేశాడు. ఎక్కడ దళితులకు అన్యాయం జరిగినా తన గళంతో నిరసన స్వరాన్ని వినిపించేవాడు. ఏనాడూ తన కళని కాసులకోసం దిగజార్చుకోలేదు. ఏ సభకు వచ్చినా కచ్ఛితంగా విజిటర్స్‌ రిజిస్టర్‌లో సంతకం చేయడం ఆయనకున్న మంచి అలవాట్లలో ఒకటి. ఆయన మరణం బహుజన సాంస్కృతిక ఉద్యమానికి తీరని లోటు. అది ఎవరూ పూరించలేనిది.

- డాక్టర్‌ నూకతోటి రవికుమార్‌, కార్యదర్శి,
బహుజన రచయితల వేదిక, ఒంగోలు. 

నిబద్ధత గల కళాకారుడు
బహుజన ఉద్యమంలో కంగున మోగే స్వరం డప్పు ప్రకాష్‌ది. ఆయన గొంతులో డప్పు శబ్దం కూడా లీనమైపోయిందా అన్నట్లుండేది. నిజాయితీ, నిబద్ధతా గల కళాకారుడు. డప్పు ప్రకాష్‌ మృతితో బహుజనోద్యమం చిన్నబోయింది. ఆయన స్ఫూర్తితో మరింత ముందుకు సాగాల్సిన అవసరం ఉంది.

- సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌, చరిత్రకారుడు, 
రచయిత, విజయవాడ
- బెందాళం క్రిష్ణారావు

ప్రజా శక్తి

No comments:

Post a Comment

THANK YOU FOR YOUR COMMENT