పోలింగ్ కేంద్రాల్లోకి ఇతరులను
అనుమతించకుండా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలంటూ ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై
ఉమ్మడి హైకోర్టు స్పందించింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు, ఎన్నికల్లో
ప్రభుత్వాధికారులు ఏ పార్టీలకు అనుకూలంగా వ్యవహరించరాదని గురువారం పేర్కొంది.
పోలీసులు, ఇతర ప్రభుత్వ అధికారులెవరూ పార్టీల జెండా మోయడానికి వీల్లేదని
స్పష్టంచేసింది. ఏ రాజకీయ పార్టీకీ విధేయత చూపకుండా నిష్పాక్షికంగా వ్యవహరించాలని
సూచించింది. పోలింగ్ కేంద్రాల్లోకి అభ్యర్థి, ఏజెంట్ తప్ప ఇతరులెవ్వరినీ అనుమతించకుండా ఎన్నికల
సంఘాన్ని ఆదేశించాలంటూ మజ్లిస్ బచావో తెహ్రీక్ అధ్యక్షుడు మజీదుల్లాఖాన్
హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు చీఫ్ జస్టిస్ టీబీఎన్
రాధాకృష్ణన్, జస్టిస్ ఎస్వీ భట్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
పాతబస్తీలోని
పోలింగ్ కేంద్రాల్లోకి ఎంఐఎంకి చెందిన సిట్టింగ్ ఎంపీ, ఎమ్మెల్యేలు 100-200 మంది దాకా అనుచరులతో కలిసి వస్తుంటారని, ఇతర పార్టీల ఏజెంట్లను బెదిరిస్తున్నారని, కొన్నేళ్లుగా మా అభ్యర్థులు ఇలాంటి పరిస్థితులను
ఎదుర్కొంటున్నారని మజీదుల్లాఖాన్ తన పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన
హైకోర్టు, కౌంటర్ దాఖలు చేయాలని ఎన్నికల సంఘాన్ని గతంలో
ఆదేశించింది. దీంతో ఎన్నికల సంఘం గురువారం కౌంటరు దాఖలు చేసింది. ఎన్నికలు
పారదర్శకంగా నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నామని ఈసీ తన అఫిడ్‌విట్‌లో
తెలిపింది. దీన్ని రికార్డు చేసిన ధర్మాసనం అభ్యంతరాలుంటే తెలపాలని పిటిషనర్‌ను
కోరింది. అనంతర విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఇదే అంశంపై నాంపల్లి
కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ ఫిరోజ్‌ఖాన్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను
డిసెంబరు 6కి
వాయిదా వేసింది.
No comments:
Post a Comment
THANK YOU FOR YOUR COMMENT